Wednesday, January 20, 2016

మెగ్నీషియం లోపిస్తే.....


మెగ్నీషియం లోపిస్తే.....
మెగ్నీషియం లోపం శరీరానికి ఒక రోగం అని కూడా పూర్వీకులు అభివర్ణిస్తుంటారు..అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటేనే ఆరోగ్యం. లేకపోతే ఏదో ఒక రూపంలో అనారోగ్యం బయటపడుతుంది. ముఖ్యంగా శరీరంలో మెగ్నీషియం తగ్గితే చాలా ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో జరిగే 300 రకాల రసాయనిక చర్యల్లో దీనిపాత్ర ఉంటుంది. గుండె కొట్టుకోవడం నుండి కండరాలు, హార్మోన్ల పనితీరు వరకు మెగ్నీషియం పాత్ర ఉంటుంది.
కనీసం రోజుకు 350 మిల్లీగ్రాముల మెగ్నీషియమ్‌....
శరీరంలో కాల్షియం, విటమిన్‌ -సిలు జీర్ణం కావడానికి మెగ్నీషియం ఎంతో అవసరం. యువకులు కనీసం రోజుకు 350 మిల్లీగ్రాముల మెగ్నీషియమ్‌ ఆహారంలో తీసుకోవాలి. యువతులయితే కనీసం 300 మిల్లీగ్రాములు తీసుకోవాలి. గర్భిణీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు అనుదినం మరొక 150 మిల్లీగ్రాములు అదనంగా తీసుకోవాల్సివస్తుంది. తమాషా ఏమిటంటే ప్రజల్లో చాలా మంది పైన సూచించిన పరిమాణంలో సగం పరిమాణంలో కూడా మెగ్నీషియం తమ ఆహారంలో తీసుకోవడం లేదు.
బ్లడ్‌షుగర్‌ను శక్తిగా మార్చగల నైపుణ్యం....
శరీరంలో బ్లడ్‌షుగర్‌ను శక్తిగా మార్చగల నైపుణ్యం మెగ్నీషియానికి సొంతం అంటున్నారు. ఒత్తిడికి లోనయిన వారిని సులువుగా మాములు స్థితికి తీసుకువస్తుంది. మనిషిని చురుగ్గా వుంచుతుంది. శరీరంలో అధికంగా కాల్షియం డిపాజిట్లు వుంటే వాటిని కరిగించగల్గుతుంది. పైగా మూత్ర పిండాలు, జీర్ణకోశంలో రాళ్ళు ఏర్పడకుండా కాపాడుతుంది. జీర్ణశక్తిని విపరీతంగా పెంచుతుంది.
శరీరంలో దాని పాత్ర......
మెగ్నీషియం ద్రాక్షపళ్లలో ఎక్కువగా వుంటుంది. శరీరంలో ప్రతి కణానికి మెగ్నీషియం అవసరం. మెదడుకు కూడా కావాలి. ప్రోటీన్‌ల సంశ్లేషణకు, కార్బొహైడ్రేట్‌లు, కొవ్వుల వినియోగానికి ఇది అవశ్యం.వందలాది ఎన్‌జైమ్‌ వ్యవస్థల చర్యలు మెగ్నీషియం లేనిదే జరగవు. ప్రత్యేకించి శక్తిఉత్పత్తికి అవసరమైన ఎంజైమ్‌లకు మెగ్నీషియం అవసరం. మెగ్నీషియం పుష్కలంగా వుంటేగాని విటమిన్‌ బి6 శోషణసరిగా జరుగదు. శక్తివిడుదలకు విటమిన్‌ బి6 ఎంతో అవసరం.
మెగ్నీషియం అధికంగా.....
కాల్షియం వలె మెగ్నీషియం కూడా నాడులను కాపాడి వాటి సేద తీరుస్తుంది. మెగ్నీషియం అధికంగా అత్తిపళ్ళు, బాదంపప్పు, ఆకుకూరలు, ఆపిల్స్‌లో కూడా లభిస్తుంది. మల్టీవిటమిన్‌ టాబ్లెట్స్‌లో, మల్టీ మినరల్‌ మందుల్లో మెగ్నీషియంను కలుపుతున్నారు. ఇటువంటి మందులు భోజనానంతరం వేసుకోకూడదు. పైగా దీర్ఘకాలం వాడకూడదు. ఎందుకంటే తిండి తిన్నాక అది జీర్ణంకావడానికి కడుపులో చాలా రకాల ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. వాటి ఉత్పత్తిని మెగ్నీషియం అదుపులో వుంచుతుంది. అందుకే దీనిని భోజనానంతరం వేసుకోకూడదు. మనం తినే ఆహారంలో పాలు - పాల ఉత్పనాల్లో మెగ్నీషియం కన్నా కాల్షియం ఎక్కువగా వుంటుంది. జంతు ఉత్పనాలలో మెగ్నీషియం చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఉండకపోవచ్చు. కాల్షియం వినియోగానికి మెగ్నీషియం అవసరం.
మెగ్నీషియం తక్కువయితే ? ....
మెగ్నీషియం తక్కువయితే పళ్లు పాడవడం, ఎముకలు గుల్లబారడం, విరిగిన ఎముకలు త్వరగా నయం కాకపోవడం జనంలో ఎక్కువగా కన్పిస్తున్నాయి. దీనికి ముఖ్యకారణం కాల్షియం ఎక్కువ, మెగ్నీషియం తక్కువగా ఉండడం కావచ్చు. వినియోగపడని కాల్షియం వల్ల శరీరానికి లాభం ఏమిటి? ప్రకృతిలో లభించే పళ్లు, కూరగాయల్లో శరీరానికి కావలసిన పోషకాలన్నీ తగినంతగా లభిస్తాయి. ఆకుపచ్చని మొక్కల్లో తప్పనిసరిగా వుండే పత్రహరితంలో మెగ్నీషియం ఒక భాగంగా ఉంటుంది.
అందుకే మనకు మెగ్నీషియం మొక్కలనుండే లభిస్తుంది. మెగ్నీషియం లోపం వల్ల శరీరంలో వణుకులు మొదలవుతాయి. కండరాలు బలహీనమవుతాయి. నిద్రపట్టదు, గుండె క్రమమైన పద్ధతిలో కొట్టుకోదు. కాళ్ళలో పగుళ్ళువస్తాయి. సాధారణంగా నీళ్ళ విరేచనాలు ఉండేవారు, మూర్చరోగాలు, మూత్రపిండాల వ్యాధులు వున్న వారిలో మెగ్నీషియం లోపం వుంటుంది. గుర్తుంచుకోండి కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు బాగా తినండి. మెగ్నీషియం లోపం ఉండదు. మీ ఆరోగ్యం బాగుంటుంది.
కాఫీఆల్కాహాల్సోడా తీసుకోవం వల్ల...
మితిమీరిన మోతాదులో కాఫీ, ఆల్కహాల్‌, సోడా తీసుకోవడం వలన శరీరానికి తగిన స్థాయిలో మెగ్నీషియం అందదు. అలాగే కూల్‌డ్రింకులు ఎక్కువగా తాగే అలవాటున్నా ఇదే పరిస్ధితి తలెత్తుతుంది. ఈ విషయాలను ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకున్నపుడు శరీరం విటమిన్‌ డిని శోషించుకోలేదు. విటమిన్‌ డి లేకపోతే శరీరం మెగ్నీషియంను ఎక్కువగా తీసుకోలేదు. తీపి పదార్థాలను అతిగా తీసుకున్నా కిడ్నీల ద్వారా మెగ్నీషియం బయటకు పోతుంది. అయితే ఈ కొరతని పూడ్చుకోవడానికి సప్లిమెంట్లు తీసుకోవచ్చు కానీ, అవి ఎక్కువైతే గుండెకు ప్రమాదం. అందుకే డాక్టర్‌ సలహా ప్రకారమే సప్లిమెంట్లు వాడాలి. ఆకుకూరలు, గింజలు, తృణ ధాన్యాలు, నట్స్‌, చేపలు, పెరుగు, అరటిపళ్లు, డార్క్‌ చాక్‌లెట్‌ మొదలైన పదార్థాల్లో మనకు మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది.

by http://10tv.in/